G.Sai Prasad: సెకండ్ హ్యాండ్ పుస్తకాలు చదివి ఐఏఎస్.. రాష్ట్రంలోనే తొలిసారిగా వారి కోసం కాంప్లెక్స్..

Wait 5 sec.

శనివారం రోజున బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్న పూర్తవటంతో ఆయన నుంచి సాయి ప్రసాద్ సీఎస్‌గా బాధ్యతలు స్వీకరించారు. 1991 ఐఏఎస్ బ్యాచ్ ఆఫీసర్ అయిన జి. సాయి ప్రసాద్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో పాటు విభజన తర్వాత సైతం పలు కీలక పదవులు నిర్వహించారు. జి. సాయి ప్రసాద్ సొంతూరు ప్రకాశం జిల్లాలోని నాగులుప్పలపాడు మండలంలో ఉన్న మట్టిగుంట. గతంలో వివిధ జిల్లాలకు కలెక్టర్‌గా వ్యవహరించిన ఆయన.. 2019-24 మధ్య ఏపీ సోలార్‌ పవర్‌ కార్పొరేషన్‌ సీఎండీగా పనిచేశారు. అలాగే ఇంధనశాఖ ఎక్స్‌ అఫీషియో ముఖ్య కార్యదర్శిగా, సీసీఎల్‌ఏగా కూడా వ్యవహరించారు. 2024 జూన్ నుంచి ఏపీ జలవనరల శాఖ కార్యదర్శిగా పనిచేశారు. 2025 జనవరి నుంచి ముఖ్యమంత్రి ఎక్స్ అఫీషియో ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నారు. అలాగే ఏపీ రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా కూడా సాయి ప్రసాద్ అదనపు బాధ్యతలు కూడా నిర్వహించారు.అయితే గుంటూరు మున్సిపల్ కమిషనర్‌గా పనిచేసిన సమయంలో సాయి ప్రసాద్ చేసిన ఓ పని.. ఇప్పటికీ స్ఫూర్తిగా నిలుస్తోంది. 30 ఏళ్ల కిందట అంటే.. 1996లో సాయి ప్రసాద్ గుంటూరు మున్సిపల్ కమిషనర్‌గా పనిచేశారు. అప్పట్లో ఓ రోజు మధ్యాహ్నం సాయి ప్రసాద్ గుంటూరు అరండల్ పేటలో రద్దీగా ఉండే వీధుల్లో పర్యటించారు. సాధారణ తనిఖీలలో భాగంగా ఆయన.. అరండల్ పేట వీధుల గుండా పర్యటించారు. అయితే ఆ పర్యటనే కొంతమంది జీవితాలను మార్చివేస్తుందని.. వారికి ఓ నీడను కల్పిస్తుందని బహుశా ఆయన కూడా ఊహించి ఉండకపోవచ్చు. ఫుట్ పాత్ మీద కొంతమంది వ్యాపారులు పుస్తకాలను అమ్ముతూ ఉన్నారు. నవలలు మొదలుకొని ఇంజనీరింగ్ పుస్తకాల వరకూ.. అన్ని రకాల పుస్తకాలు అక్కడ అందుబాటులో ఉన్నాయి.సాధారణ తనిఖీలో భాగంగా అలా తిరుగుతూ ఉన్న ఆయన.. ఫుట్ పాత్ మీద ఉన్న పుస్తకాల దుకాణాలు చూస్తూనే ఆగిపోయారు. అక్కడి వ్యాపారులతో ముచ్చటించడం మొదలెట్టారు. వచ్చింది గుంటూరు మున్సిపల్ కమిషనర్ అనే సంగతి తెలియని.. ఆ పుస్తకాల వ్యాపారులు తమ కష్టాలను, తమ జీవితాలను ఆయనతో చెప్పుకున్నారు. అలా ఓ పిచ్చాపాటీగా మొదలైన ఆ ముచ్చట్లు.. రెండు గంటలపాటు నడిచాయి. తాము సెకండ్ హ్యాండ్ పుస్తకాలను ఎలా సేకరిస్తాం.. వాటిని అర్ధరాత్రి వరకూ మేలుకుని ఎలా శుభ్రపరుస్తామనే సంగతులు మొదలుకుని.. భారీ భారీ బండిళ్ల పుస్తకాలను రోడ్డు పక్కకు ఎలా తీసుకువస్తాం.. అవి అమ్ముడయ్యే వరకూ గంటల తరబడి తమ ఎదురు చూపులు ఎలా ఉంటాయనే విషయాల వరకూ ఆ చిరు వ్యాపారులు సాయి ప్రసాద్‌తో చెప్పుకున్నారు. ఇక వర్షాకాలంలో వానలు పడితే పుస్తకాలు తడవకుండా తాము పడే పాట్లు వెళ్లబోసుకున్నారు. వానాకాలం వస్తే వర్షానికి తడిచి పుస్తకాలు దెబ్బతినడమే కాకుండా తమ వ్యాపారం కూడా దెబ్బతింటుందని చెప్పుకొచ్చారు.సాధారణ మధ్య తరగతి కుటుంబానికి చెందిన సాయి ప్రసాద్‌కు.. మధ్య తరగతి వెతలు తెలియని ఏమీ కాదు. పుస్తక వ్యాపారుల కష్టాలు చూసిన ఆయనకు.. తాను సివిల్స్ పరీక్షలకు సన్నద్ధమయ్యే సమయంలో సెకండ్ హ్యాండ్ పుస్తకాల మీద ఆధారపడిన రోజులు గుర్తుకువచ్చాయి. సాయి ప్రసాద్ తండ్రి ఓ టీచర్. తన సివిల్స్ పరీక్షల భారం తండ్రి మీద పడకూడదనే ఉద్దేశంతో సెకండ్ హ్యాండ్ పుస్తకాలతోనే సివిల్స్ పరీక్షలకు ప్రిపేర్ అయ్యారాయన. దీంతో వీధి వ్యాపారుల కష్టాలు ఆయనను కదిలించాయి. కొద్దిరోజులలోనే పాత పుస్తకాల విక్రయదారుల కోసం ఆ ప్రాంతంలో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణానికి అనుమతులు మంజూరు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. సాయి ప్రసాద్ నిర్ణయంతో రాష్ట్రంలోనే తొలిసారిగా గుంటూరులో సెకండ్ హ్యాండ్ పుస్తకాల కోసం కాంప్లెక్స్ ఏర్పాటైంది. తక్కువ లీజు ధరలకే పుస్తక వ్యాపారులకు షాపులు కేటాయించారు. దీంతో ఎండా, వానల నుంచి ఆ పుస్తక వ్యాపారులకు ఇబ్బందులు తప్పాయి. సాయి ప్రసాద్ ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన తరుణంలో గుంటూరు జనం.. ఈ విషయాన్ని గుర్తు చేసుకుంటున్నారు.