మార్చి 1 నుంచి కొత్త రూల్స్.. సిమ్ లేకపోతే వాట్సాప్ బంద్.. ఆ రైల్వే యాప్‌కు చెల్లు!

Wait 5 sec.

: సాధారణంగా క్యాలెండర్‌లో నెల మారగానే.. కొన్ని కొత్త కొత్త నిర్ణయాలు కూడా అమల్లోకి వస్తుంటాయి. ఇక్కడ కొన్ని సాధారణ ప్రజల రోజువారీ దినచర్య సహా బడ్జెట్‌ను కూడా ప్రభావితం చేసేలా ఉంటాయి. కొన్ని సాంకేతిక, పరిపాలనా నిబంధనలు కూడా మారుతున్నాయి. మార్చి 1 నుంచి కొన్ని మారబోతున్నాయి. కొన్ని సామాన్యుల జేబుపై నేరుగా ప్రభావం చూపనున్నాయి. ఇక్కడ ప్రధానంగా తెలుసుకోవాల్సింది సిమ్ బైెండింగ్ రూల్స్. ఇది వాట్సాప్, టెలిగ్రామ్ వంటి కమ్యూనికేషన్ యాప్స్‌కు సంబంధించింది. అంటే సిమ్ లేకపోతే ఆయా యాప్స్ సదరు ఫోన్లలో పనిచేయవు. కిందటి సంవత్సరం నవంబరులో ఈ నిబంధనలు ప్రకటించగా.. అమలు కోసం ఆ సంస్థలకు ఇచ్చిన గడువు ఫిబ్రవరి 28తో ముగియనుంది. కొత్త రూల్స్ ప్రకారం.. ఇక ఎవరైనా సిమ్ లేకుండా ఫోన్‌లో వాట్సాప్ వాడుతుంటే గనుక యాప్ నిలిచిపోతుంది. ఇంకా వాట్సాప్ వెబ్ కూడా వాడకంలో లేకపోతే ప్రతి 6 గంటలకు ఓసారి ఆటోమేటిక్‌గానే లాగౌట్ అవుతుంది. వాట్సాప్ సహా టెలిగ్రామ్, సిగ్నల్, అరట్టై వంటి కమ్యూనికేషన్స్ యాప్స్ దుర్వినియోగాన్ని అడ్డుకునేందుకు కేంద్రం కొత్త నిబంధన తీసుకొచ్చింది. అందుకే ఈ యాప్స్‌కు సిమ్ బైండింగ్ తప్పనిసరి చేసింది. దీని ప్రకారం.. ఫోన్‌లో సిమ్ లేకున్నా.. సిమ్ తీసేసినా ఈ సేవలు నిలిచిపోనున్నాయి.భారతీయ రైల్వేకు చెందిన పాత యూటీఎస్ మొబైల్ యాప్ మార్చి 1 నుంచి పనిచేయదు. దీంతో ఇక మీదట ప్రయాణికులు ఇది ఉపయోగించుకోలేరు. RailOne అనే కొత్త యాప్ ద్వారా రిజర్వేషన్ లేని టికెట్లు, ప్లాట్‌ఫాం టికెట్స్, జనరల్ టికెట్లు బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రారంభంలో కాస్త సాంకేతిక ఇబ్బందులు తలెత్తొచ్చు. కొత్త వ్యవస్థకు అనుగుణంగా ప్రయాణికులు మారాల్సి ఉంటుంది. కొత్త యాప్ వ్యవస్థ.. మరింత సురక్షితంగా, యూజర్ ఫ్రెండ్లీగా, వేగంగా ఉంటుందని తెలుస్తోంది. ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ ధరలు కూడా ప్రతి నెలా ఒకటో తేదీన మారుతుంటాయి. చమురు మార్కెటింగ్ కంపెనీలు వీటి ధరల్ని సవరిస్తుంటాయి. మార్చి 1 న వీటి ధరలు పెరుగుతాయా.. తగ్గుతాయా అనేది తెలుస్తుంది. ఇక్కడ ధరలు పెరిగితే నేరుగా సామాన్యులపై ప్రభావం పడుతుందన్నమాట. గ్యాస్ సిలిండర్ ధరలతో పాటు CNG, పీఎన్‌జీ, ఏటీఎఫ్ (విమాన ఇంధనం) ధరలు కూడా మారుతుంటాయి. వీటితో పాటు ప్రభుత్వ రంగ బ్యాంకులు.. కస్టమర్లు నెలవారీగా బ్యాంక్ అకౌంట్లో మెయింటెయిన్ చేయాల్సిన కనీస బ్యాలెన్స్ లెక్కించే పద్ధతిని మార్చొచ్చని తెలుస్తోంది. మార్చిలో హోలీ, రంజాన్, ఉగాది, శ్రీరామ నవమి ఇలా వరుస పండగల నేపథ్యంలో బ్యాంకులకు కూడా సెలవులు ఉన్నాయి. దీని ప్రకారం షెడ్యూల్ చేసుకోవడం మంచిది.డిజిటల్ పేమెంట్స్‌లో కొంత కాలంగా ఫ్రాడ్స్ పెరిగిన నేపథ్యంలో.. నిబంధనల్ని మరింత కఠినతరం చేయనున్నట్లు తెలుస్తోంది. ఇక్కడ కాస్త పెద్ద మొత్తంలో చేసే ట్రాన్సాక్షన్లపై అదనపు ధ్రువీకరణ అవసరం రావొచ్చు. దీనికి అనుగుణంగా సిద్ధం కావాల్సి ఉంటుంది.