మీ సేవ మీ టికెట్ యాప్‌లో బస్ టికెట్లు, పాస్‌ రెన్యూవల్స్.. ప్రయాణికులకు గుడ్‌న్యూస్ చెప్పిన టీజీఎస్ఆర్టీసీ

Wait 5 sec.

తెలంగాణలో బస్సు ప్రయాణికులకు ఆర్టీసీ శుభవార్త చెప్పింది. ప్రస్తుతం కేవలం ఆన్‌లైన్, రిజర్వేషన్ కౌంటర్ల ద్వారా బస్ టికెట్లు బుక్ చేసుకునేందుకు టీజీఎస్‌ఆర్‌టీసీ పోర్టల్ మాత్రమే అందుబాటులో ఉండగా.. ఇప్పుడు ప్రయాణికులకు మరో సౌకర్యాన్ని కల్పించింది. ఇక నుంచి ప్రయాణికులు మీ సేవ మొబైల్ యాప్‌లో కూడా బస్ టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చని వెల్లడించింది. ప్రయాణికుల సౌకర్యం కోసమే ఈ యాప్ బుకింగ్‌ను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు స్పష్టం చేసింది. మీ సేవ మీ టికెట్ మొబైల్ యాప్ ద్వారా ఆర్టీసీ బస్ టికెట్లను బుక్ చేసుకునే సౌకర్యాన్ని అధికారులు తెలిపారు. బస్సుల్లో ప్రయాణించే వారందరూ ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకోవాలని సూచించారు.సచివాలయంలో తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ కొత్త మీ సేవ మీ టికెట్ యాప్‌ను మంగళవారం ప్రారంభించారు. రవాణా శాఖ స్పెషల్ సెక్రటరీ వికాస్ రాజ్, తెలంగాణ ఆర్టీసీ వీసీ అండ్ ఎండీ వై.నాగిరెడ్డి, మీ సేవ కమిషనర్ రవికిరణ్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్బంగా మొబైల్ యాప్‌ను ఆవిష్కరించి.. ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకువచ్చారు. ఈ సరికొత్త విధానం ద్వారా మీ టికెట్ మొబైల్ యాప్ ఓపీఆర్ఎస్ (OPRS) సేవలను కూడా అనుసంధానించారు. దీంతో ప్రయాణికులు దూర ప్రయాణాలు, ఇంటర్‌సిటీ బస్ టిక్కెట్లను కూడా డిజిటల్‌గా బుక్ చేసుకోవచ్చని అధికారులు తెలిపారు.మొత్తం OPRS సేవలు 1,710.. ఏసీ సేవలు 450.. నాన్ ఏసీ సేవలు 1,260.. రోజువారీగా బుకింగ్ ఆయ్యే సీట్లు 13,000 అని అధికారులు వెల్లడించారు. బెంగళూరు, తిరుపతి, విశాఖపట్నం, విజయవాడ, మంచిర్యాల, ఖమ్మం, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, వరంగల్ వంటి హైదరాబాద్ నుంచి దూర ప్రాంతాలకు వెళ్లే బస్సుల్లో ఈ టికెట్ బుకింగ్ సౌకర్యం కల్పించినట్లు అధికారులు తెలిపారు. గ్రేటర్ హైదరాబాద్ జోన్ పరిధిలో 5 రకాల బస్ పాస్‌లను కూడా పొందే సౌకర్యంతోపాటు రెన్యూవల్ చేసుకునే సదుపాయాన్ని కూడా కల్పించారు. ఇప్పటివరకు స్టూడెంట్, జనరల్ బస్ పాస్‌లు కావాలంటే ప్రత్యేకంగా ఏర్పాటు చేసే బస్ పాస్ కౌంటర్లకు మాత్రమే వెళ్లాల్సి వచ్చేది. అక్కడ క్యూలైన్లలో నిలబడి వేచి చూసి.. తీసుకోవాల్సి ఉండేది. కానీ ఇక నుంచి డిజిటల్ విధానంలోనే బస్ పాస్‌లను పొందే అవకాశం కల్పించారు. ఈ నిర్ణయం వల్ల బస్ పాస్ కౌంటర్లకు వెళ్లే బాధ తప్పింది. బస్ పాస్‌ రెన్యూవల్ కూడా చేసుకోవచ్చని తెలిపారు. నిత్యం హైదరాబాద్‌లో బస్ పాస్ ద్వారా లక్షల మంది ప్రయాణాలు చేస్తుండగా.. ఈ నిర్ణయం వారికి భారీ ఊరట కల్పించనుంది.సిటీ ఆర్డినరీ బస్ పాస్ నెలకు రూ.1,400.. మెట్రో ఎక్స్‌ప్రెస్ పాస్ రూ.1,600.. మెట్రో డీలక్స్ పాస్ రూ.1,800.. గ్రీన్ మెట్రో లగ్జరీ ఏసీ నెలవారీ పాస్ రూ.2,200.. పుష్పక్ ఏసీ పాస్ రూ.5,000గా వసూలు చేస్తున్నారు.