పోలవరం-నల్లమల సాగర్‌‌కు తెలంగాణ అభ్యంతరం చెప్పొద్దు.. అసెంబ్లీలో చంద్రబాబు వ్యాఖ్యలు

Wait 5 sec.

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా.. ఏపీ ముఖ్యమంత్రి నారా నాయుడు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర చర్చకు దారి తీశాయి. గంగా- కావేరి నదుల అనుసంధానం పూర్తి చేయాలి అనేది తన చిరకాల కోరిక అని అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారు. మన సంప్రదాయంలో ప్రకృతిని ఆరాధించడం, నీటిని పూజించడం ఉందని తెలిపారు. గోదావరి నదికి అఖండ హారతి ఇచ్చామని.. కృష్ణా నదికి పవిత్ర హారతి ఇచ్చామని గుర్తు చేసిన చంద్రబాబు.. నదులను పూజించే సంప్రదాయం ఉందని పేర్కొన్నారు. సాగునీటి రంగంపై అసెంబ్లీలో మాట్లాడిన చంద్రబాబు.. పోలవరం ప్రాజెక్టు, పోలవరం-నల్లమల సాగర్ లింక్ ప్రాజెక్టులపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కట్టిన ప్రాజెక్టులు అన్నీ ఎన్డీఏ, తెలుగుదేశం పార్టీ హయాంలోనే జరిగాయని.. తెలుగు రాష్ట్రాల నీటి పారుదల ప్రాజెక్టులకు కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందేమీ లేదని చంద్రబాబు విమర్శించారు. పట్టిసీమ నుంచి 100 టీఎంసీల నీటిని కృష్ణాకు తీసుకొచ్చినట్లు గుర్తు చేసిన చంద్రబాబు.. వెలిగొండ ప్రాజెక్టుకు గతంలో తానే శంకుస్థాపన చేశానని.. ఇప్పుడు తానే పూర్తి చేస్తున్నట్లు వెల్లడించారు. ధవళేశ్వరం బ్యారేజీని నిర్మించిన బ్రిటన్ ఇంజినీర్ సర్ అర్ధర్ కాటన్‌ దొరను ఇప్పటికీ గుర్తుపెట్టుకుని.. గోదావరి జిల్లాల్లో ఆయన విగ్రహాలకు పూజిస్తున్నారని చంద్రబాబు తెలిపారు.పోలవరం-నల్లమల సాగర్‌ లింక్ ప్రాజెక్టు వల్ల తెలంగాణకు, ఏపీకి ఎలాంటి నష్టం లేదని తేల్చి చెప్పిన చంద్రబాబు.. గోదావరి నది నుంచి వృథాగా సముద్రంలోకి వెళ్లే వరద నీటిని మాత్రమే తరలిస్తామని తెలిపారు. గోదావరి నదిపైన ఎగువన ఉన్న తెలంగాణ కాళేశ్వరం ప్రాజెక్టును కట్టిందని.. అందుకు తాము అభ్యంతరం చెప్పలేదని గుర్తు చేశారు. అందుకే తెలంగాణ ప్రభుత్వం ఈ పోలవరం-నల్లమల సాగర్ లింక్ ప్రాజెక్టుకు అడ్డు చెప్పకూడదని అన్నారు. ఈ ప్రాజెక్టు వల్ల రెండు తెలుగు రాష్ట్రాలకు లాభమని పేర్కొన్నారు. తన హయాంలోనే రెండోసారి గోదావరి నది పుష్కరాలు జరగబోతున్నాయని ఈ సందర్భంగా చంద్రబాబు తెలిపారు. గోదావరి పుష్కరాల కోసం భారీగా ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు. ఎప్పటినుంచో పెండింగ్‌లో ఉన్న పోలవరం ప్రాజెక్టును గోదావరి పుష్కరాల కంటే ముందే కంప్లీట్ చేసి.. ప్రారంభిస్తామని చంద్రబాబు తెలిపారు. ఈ సందర్భంగా పోలవరం ప్రాజెక్టును ఎమ్మెల్యేలు అందరూ వెళ్లి పరిశీలించాలని అసెంబ్లీలో సూచించారు. మళ్లీ ఇలాంటి అద్భుత అవకాశం రాదని పేర్కొన్నారు. ఇప్పటికీ 66 ప్రాజెక్టులు నీటితో జలకళను సంతరించుకున్నాయని చంద్రబాబు తెలిపారు.జూలై నెలలో వెలిగొండ ఫేజ్-1 నుంచి నీళ్లు రానున్నాయని చంద్రబాబు స్పష్టం చేశారు. రూ. 2,500 కోట్ల పనులను పెండింగ్‌లో ఉండగానే గత ప్రభుత్వం ప్రాజెక్టును జాతికి అంకితం అని హడావుడి చేసినట్లు సెటైర్లు వేశారు. అదేవిధంగా శ్రీశైలం రిజర్వాయర్ నుంచి రాయలసీమకు నీళ్లు తెచ్చినట్లు చెప్పారు. వెలిగొండ ప్రాజెక్టుకు 14 వారాల డెడ్‌లైన్ పెట్టినట్లు తెలిపిన చంద్రబాబు.. ప్రతి వారం రిపోర్టులు పరిశీలిస్తానని వెల్లడించారు. ఉత్తరాంధ్రలో 11 ప్రాజెక్టులను ఈ ప్రభుత్వ హయాంలోనే పూర్తి చేస్తానని తేల్చి చెప్పారు.