Machilipatnam Gold Theft: ఏపీలో పట్టపగలే భారీ చోరీ.. అరకిలో బంగారం ఎత్తుకెళ్లిన దొంగలు..

Wait 5 sec.

ఏపీలోని కృష్ణా జిల్లా జరిగింది. పట్టపగలే భారీ చోరీ చోటుచేసుకుంది. మచిలీపట్నంలోని చిలకలపూడి సర్కార్ తోట ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఓ ఉపాధ్యాయురాలి ఇంట్లోకి చొరబడిన దొంగలు.. 50 తులాల బంగారాన్ని దోచుకెళ్లారు. బాధితురాలు చెప్తున్న వివరాల ప్రకారం.. మార్గరెట్ అనే మహిళ.. గుడ్లవల్లేరు మండలం కౌతరంలోని ఉర్దూ పాఠశాలలో పనిచేస్తున్నారు. రోజూ మాదిరిగానే బుధవారం ఉదయం విధులకు వెళ్లారు మార్గరెట్. చిలకలపూడి సర్కార్ తోటలోని ఇంటికి తాళాలు వేసి స్కూలుకు వెళ్లారు. అయితే రంజాన్ మాసం కావడంతో స్కూలుకు మధ్యాహ్నం నుంచి సెలవు ఇచ్చారు. దీంతో మార్గరెట్ స్కూలు నుంచి ఇంటికి చేరుకున్నారు. అయితే అప్పటికే తలుపులు పగలగొట్టి ఉన్నాయని మార్గరెట్ చెప్తున్నారు. లోపలికి వెళ్లి చూసిన తర్వాత ఇంట్లో చోరీ జరిగిందనే విషయం అర్థమై.. మార్గరెట్ వెంటనే చిలకలపూడి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో చిలకలపూడి పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నారు. క్లూస్ టీమ్ సాయంతో ఆధారాలు సేకరించే ప్రయత్నం చేశారు. మరోవైపు ఈ చోరీలో సుమారుగా 50 తులాల బంగారం, లక్షా 40 వేల రూపాయల నగదు చోరీ జరిగినట్లు మార్గరెట్ చెప్తున్నారు. పోలీసులు ఇది ఎవరైనా తెలిసిన వ్యక్తుల పనా.. లేదంటే దీని వెనుక ఏదైనా ముఠా హస్తం ఉందా అనే కోణంలో దర్యాప్తు జరుపుతున్నారు. అయితే ఇంత పెద్దమొత్తంలో ఏకంగా అర కిలో బంగారం చోరీ కావటం స్థానికంగా కలకలం రేపుతోంది. దీంతో పోలీసులు కూడా ఈ కేసును చాలా సీరియస్‌గా తీసుకుని దొంగతనానికి పాల్పడిన వారిని గుర్తించే పనిలో పడ్డారు. వ్యసనాలకు బానిసై దొంగగా మారిన ప్రభుత్వ ఉద్యోగిమరోవైపు తిరువూరు గ్రామీణం మండలం చిక్కుళ్లగూడెంలో జరిగిన చోరీ కేసును పోలీసులు ఛేదించారు. దొంగతనానికి పాల్పడిన వ్యక్తిని అరెస్ట్ చేశారు. నిందితుడిని విజయవాడకు చెందిన అసిస్టెంట్ లైన్‌మెన్ సుభాష్‌గా గుర్తించారు. చెడు వ్యసనాలకు బానిసగా మారిన సుభాష్.. నేరాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ క్రమంలోనే తిరువూరు మండలం గానుగపాడులో బైక్ చోరీ చేశాడని.. ఆ బైక్ మీద వెళ్తూనే అనసూయ అనే వృద్ధురాలి మెడలో 40 గ్రాముల బంగారు చైన్‌ను లాక్కెళ్లినట్లు పోలీసులు తెలిపారు. నిందితుణ్ని అరెస్ట్ చేసిన పోలీసులు.. దొంగిలించిన బంగారంతో పాటు బైక్‌ స్వాధీనం చేసుకున్నారు.