కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్.. విచారణ వాయిదా వేసిన హైకోర్టు

Wait 5 sec.

ఆసియాలోనే అతిపెద్ద ఎత్తిపోతల పథకం అయిన నిర్మాణంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వ హాయంలో భారీ అవినీతి జరిగిందంటూ ప్రస్తుత రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని సేకరించేందుకు జస్టి్స్ పీసీ ఘోష్ నేతృత్వంలో రేవంత్ రెడ్డి సర్కార్ కమిషన్ ఏర్పాటు చేసింది. ఆ కమిషన్ కాళేశ్వరం ప్రాజెక్టును పరిశీలించి.. రాష్ట్ర ప్రభుత్వానికి కొన్ని నెలల క్రితమే నివేదికను సమర్పించింది. ఆ నివేదికలో కాళేశ్వరం ప్రాజెక్టు కుంగిపోవడంలో మాజీ సీఎం కేసీఆర్, రాష్ట్ర మాజీ నీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు సహా పలువురు ప్రత్యక్ష్యంగా, పరోక్షంగా పాత్ర ఉందని కమిషన్ ఆరోపించింది.ఈ నేపథ్యంలోనే అంతా తప్పుడు నివేదిక ఇచ్చిందని.. ఆ రిపోర్ట్‌ను రద్దు చేయాలంటూ.. బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్.. మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు.. ఐఏఎస్ స్మితా సబర్వాల్.. మాజీ సీఎస్ ఎస్‌కే జోషి సహా పలువురు వేర్వేరుగా గతంలోనే తెలంగాణ హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఈ క్రమంలోనే ఆ పిటిషన్లపై బుధవారం రోజున తెలంగాణ హైకోర్టు విచారణ చేపట్టింది. కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారణ సందర్భంగా హరీష్ రావు తరఫున సుప్రీంకోర్టు లాయర్ సుందరం వాదనలు వినిపించారు. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్.. తమకు ఉన్న పరిధిని దాటి మరీ వ్యవహరించిందని లాయర్ సుందరం వాదించారు. కమిషన్ ఆఫ్ ఎంక్వయిరీస్ చట్టం ప్రకారం ఈ జస్టిస్ పీసీ ఘోష్ రిపోర్ట్ చెల్లదని కోర్టుకు విన్నవించారు. మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్ కుంగిపోతే రాష్ట్ర ప్రభుత్వం కమిషన్ ఏర్పాటు చేసిందని.. అయితే అక్కడ ఏం జరిగిందో పరిశీలించి కమిషన్ నివేదిక ఇవ్వాలని.. ఆ బాధ్యత మాత్రమే కమిషన్‌పై ఉంటుందని పేర్కొన్నారు. కానీ పీసీ ఘోష్ కమిషన్ తన పరిధి దాటి రిపోర్ట్ ఇచ్చిందని తెలిపారు. అందుకే జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ రిపోర్టు చెల్లదని.. దాన్ని రద్దు చేయాలని వాదనలు వినిపించారు. లాయర్ సుందరం వాదనలు విన్న హైకోర్టు.. ఈ వ్యవహారంలో తదుపరి విచారణను ఈనెల 27వ తేదీకి వాయిదా వేసింది. మరోవైపు.. ఎల్లుండి (ఫిబ్రవరి 27వ తేదీన) కేసీఆర్ తరఫున లాయర్ శేషాద్రి నాయుడు హైకోర్టులో వాదనలు వినిపించనున్నారు.