తెలుగు రాష్ట్రాల నుంచి అరుణాచలం సందర్శనకు, గిరి ప్రదక్షిణకు వెళ్లేవారి సంఖ్య క్రమక్రమంగా పెరుగుతోంది. ముఖ్యంగా పౌర్ణమి రోజులలో ఈ సంఖ్య మరింత ఎక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలో ప్రయాణికుల సౌకర్యం, సౌలభ్యాన్ని దృష్టిలో పెట్టుకుని రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ నాంపల్లి రైల్వేస్టేషన్ నుంచి కన్యాకుమారి మధ్య రాకపోకలు సాగించే నాంపల్లి - కన్యాకుమారి వీక్లి ఎక్స్‌ప్రెస్‌ను రెగ్యులర్ సర్వీసుగా మారుస్తూ నిర్ణయం తీసుకుంది. నాంపల్లి - కన్యాకుమారి (07229/07230) ఎక్స్ ప్రెస్ గత ఐదు సంవత్సరాలుగా వీక్లి రైలు సర్వీసుగా సేవలు అందిస్తోంది. అయితే ఈ రైలు సర్వీసును రెగ్యులర్ సర్వీసుగా మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు. రెగ్యులర్ సర్వీసుగా మార్చిన నేపథ్యంలో నాంపల్లి - కన్యాకుమారి ఎక్స్ ప్రెస్ రైలు నంబరును కూడా 17069/17070 మార్పు చేయనున్నారు.మరోవైపు నాంపల్లి రైల్వేస్టేషన్ నుంచి ప్రతి బుధవారం సాయంత్రం 5 గంటల 20 నిమిషాలకు 17069 నంబరుతో బయల్దేరే ఈ రైలు.. మరుసటి రోజు ఉదయం రెండున్నర గంటలకు కన్యాకుమారి చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో శుక్రవారం తెల్లవారుజామున 5 గంటల 15 నిమిషాలకు కన్యాకుమారి నుంచి బయల్దేరి.. శనివారం మధ్యాహ్నం 2:30 గంటలకు హైదరాబాద్‌కు చేరుకుంటుంది. నాంపల్లి - అరుణాచలం రెగ్యులర్ ఎక్స్‌ప్రెస్ రైలు సికింద్రాబాద్, చర్లపల్లి రైల్వేస్టేషన్, నల్గొండ, మిర్యాలగూడ రైల్వేస్టేషన్, నడికుడి, సత్తెనపల్లి, గుంటూరు, తెనాలి రైల్వేస్టేషన్, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట రైల్వేస్టేషన్, తిరుపతి, పాకాల, చిత్తూరు, కాట్పాడి, అరుణాచలం (తిరువణ్ణామలై) స్టేషన్ల మీదుగా కన్యాకుమారి చేరుకుంటుంది.మరోవైపు కాచిగూడ - మధురై రైల్వేస్టేషన్ మధ్య రాకపోకలు సాగించే రైలును కూడా తూత్తుకూడి వరకూ పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీనికి 17615/17616 కేటాయించారు. దీనిని కాచిగూడ-తుత్తుకుడి ఎక్స్‌ప్రెస్‌గా మార్చారు. సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు కాచిగూడ రైల్వేస్టేషన్ నుంచి బయల్దేరే ఈ రైలు.. మంగళవారం రాత్రి 10:45 నిమిషాలకు తూత్తుకుడి రైల్వేస్టేషన్ చేరుకుంటుంది. బుధవారం ఉదయం 7:45 నిమిషాలకు తూత్తుకుడి రైల్వేస్టేషన్ నుంచి బయల్దేరి.. గురువారం రోజు మధ్యాహ్నం 1:25 నిమిషాలకు కాచిగూడ రైల్వేస్టేషన్ చేరుకుంటుంది. ఈ రైలు కూడా అరుణాచలం రైల్వేస్టేషన్ మీదుగా రాకపోకలు సాగిస్తుంది.