ఖమ్మం నగర శివారులోని వెలుగుమట్ల భూదాన్ భూముల వివాదం ప్రస్తుతం తెలంగాణలో హాట్ టాఫిక్‌ మారింది. ఈనెల 24న రెవెన్యూ, మున్సిపల్ అధికారులు భారీ పోలీస్ బందోబస్తు మధ్య అక్కడి పేదల నిర్మాణాలను నేలమట్టం చేశారు. వందలాది ఇళ్లను జేసీబీలతో నేలమట్టం చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అవి ప్రభుత్వ భూములని కొందరు రాజకీయ నాయకులు, దళారులు పేదల నుంచి డబ్బులు తీసుకొని అక్రమంగా ఈ స్థలాలను అంటగట్టారని అధికారులు ఆరోపిస్తున్నారు. ముందస్తు నోటీసులు ఇవ్వకుండా, కనీసం సామాన్లు సర్దుకోవడానికి సమయం ఇవ్వకుండా కూల్చివేతలు చేపట్టారని బాధితులు రోదిస్తున్నారు. వారికి అండగా ప్రతిపక్షాలు నిలుస్తున్నాయి. ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ఫైరవుతున్నారు. ఈ నేపథ్యంలో వినోబాభావే నగర్‌లో ఇళ్ల తొలగింపుతో గూడు కోల్పోయిన వారికి అండగా నిలిచేందుకు తెలంగాణ ప్రభుత్వం కసరత్తు చేపట్టింది. ఈ మేరకు సీఎం రేవంత్, రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిలు జిల్లా కలెక్టర్‌ అనుదీప్‌ దురిశెట్టితో ఈ విషయంపై చర్చించారు. తొలగించిన ఇళ్ల వారీగా సామాజిక, ఆర్థిక సర్వే చేపట్టి నివేదిక అందించాలని సీఎం ఆదేశించారు. అందులో అర్హులకు ఇందిరమ్మ ఇళ్లు వెంటనే మంజూరు చేయాలని సూచించారు. ఇక భూదాన్‌ యజ్ఞ బోర్డు, రెవెన్యూశాఖ విచారణలో నకిలీపత్రాలు, అక్రమ కేటాయింపులు వెలుగుచూశాయి. దీంతో పలువురిపై క్రిమినల్‌ కేసులు నమోదు చేశారు. వెలుగుమట్లలో అక్రమ నిర్మాణాల తొలగింపుతో రూ.250 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని స్వాధీనపరచుకున్నట్లు కలెక్టర్‌ అనుదీప్ దురిశెట్టి వెల్లడించారు. తాజాగా సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి ఆదేశాలతో కూల్చివేత సమయంలో చేపట్టిన పంచనామా ప్రకారం అధికారులు సర్వే చేపడుతున్నారు. ప్రస్తుతం 100 కుటుంబాల సర్వే పూర్తయినట్లు అధికారులు తెలిపారు. ఇళ్లు కోల్పోయిన వారిలో ఖమ్మం స్థానికులు ఎంత మంది..? ఇతర జిల్లాలకు చెందిన వారు ఎందరు ఉన్నారనే లెక్కలు బయటకు తీస్తున్నారు. ఇల్లు నిర్మించుకునే స్థోమత ఉందా, వారికి ఆస్తులు ఉన్నాయా వంటి వివరాలను అధికారులు సేకరిస్తున్నారు. సర్వే పూర్తయిన వెంటనే ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాల వారీగా అర్హులను గుర్తించి వారికి ఎక్కడికక్కడ ఇందిరమ్మ ఇళ్లు కేటాయిస్తామని జిల్లా కలెక్టర్‌ వెల్లడించారు.