కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశవ్యాప్తంగా నిత్యం లక్ష మందికి పైగా వస్తుంటారు. ఇక తిరుమల శ్రీవారి దర్శనాలు, వివిధ రకాల సేవల్లో పాల్గొనేందుకు.. భక్తులు ఆన్‌లైన్‌లో ముందుగానే టికెట్లు బుక్ చేసుకుంటారు. ఆన్‌లైన్‌లో టికెట్లు బుక్ చేసుకోలేని వారు.. నేరుగా తిరుమల కొండకు వచ్చి సర్వ దర్శనాలు, స్లాటెడ్ సర్వ దర్శనాలు (ఎస్ఎస్‌డీ) టోకెన్లు తీసుకుని.. స్వామి వారిని దర్శించుకుంటారు. అయితే ప్రతీ నెల ఆయా తేదీల్లో తిరుమల శ్రీవారి సేవలు, దర్శనాలు, ఇతర టికెట్లను తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అధికారులు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తూ ఉంటారు. లక్షలాది మంది భక్తులు ఈ టికెట్ల కోసం ఎగబడటంతో హాట్ కేకుల్లా క్షణాల్లో అవన్నీ బుకింగ్స్ అయిపోతూ ఉంటాయి. అయితే శ్రీవారి దర్శనాలు, వసతి గదులు బుక్ చేసుకునే భక్తులు.. ఆన్‌లైన్ బుకింగ్ సమయంలో చాలా అలర్ట్‌గా ఉండాలని.. టీటీడీ అధికారులు సూచిస్తున్నారు. అచ్చం టీటీడీ వెబ్‌సైట్‌ను పోలి ఉండే నకిలీ వెబ్‌సైట్‌ను తయారు చేసి.. కొందరు దుండగులు.. భక్తులను మోసం చేస్తున్నట్లు తాము గుర్తించామని వెల్లడించారు. నకిలీ వెబ్‌సైట్ల పట్ల భక్తులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. టీటీడీ పేరుతో నకిలీ వెబ్‌సైట్లను సృష్టించి.. భక్తులను మోసం చేస్తున్న దళారీలపై టీటీడీ విజిలెన్స్ విభాగం మరింత నిఘా పెట్టింది. తాజాగా కేరళకు చెందిన సీకే సురేష్ బాబు అనే భక్తుడు.. కర్ణాటక ప్రవాసి సౌధ పేరుతో తిరుమలలో గదులు ఇప్పిస్తామని నకిలీ వెబ్‌సైట్ ద్వారా మోసపోయిన ఘటన వెలుగులోకి రావడంతో భక్తులను టీటీడీ అలర్ట్ చేస్తోంది. ఇక బాధితుడు సీకే సురేష్ బాబు ఫిర్యాదుతో రంగంలోకి దిగిన టీటీడీ విజిలెన్స్ అధికారులు.. గూగుల్‌లో టీటీడీ పేరుతో కనిపిస్తున్న పలు ఫేక్ వెబ్‌సైట్ల ద్వారా శ్రీవారి భక్తుల దగ్గరి నుంచి ఆన్‌లైన్ పేమెంట్ల రూపంలో నిందితులు భారీగా డబ్బులు వసూలు చేస్తున్నట్లు గుర్తించారు. ఇక ఆ నకిలీ వెబ్‌సైట్లలో టీటీడీ లోగోలు, తిరుమల ఆలయ ఫోటోలను అనధికారికంగా వాడుతూ.. భక్తులను మోసం చేస్తున్నారని తేల్చారు.ఈ నేపథ్యంలోనే టీటీడీ ఐటీ విభాగం.. ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పాటు.. కాపీరైట్ చట్టం కింద బాధ్యులపై కేసులు నమోదు చేసింది. దర్శనాలు, వసతి, ఇతర సేవా టికెట్ల కోసం భక్తులు కేవలం టీటీడీ అధికారిక వెబ్‌సైట్ () మాత్రమే సందర్శించాలని అధికారులు స్పష్టం చేశారు. గూగుల్‌లో కనిపించే అనుమానాస్పద లింక్‌లను నమ్మవద్దని.. దళారులను నమ్మి అనవసరంగా డబ్బులు పోగొట్టుకోవద్దని సూచిస్తున్నారు. ఏదైనా అనుమానాస్పద వెబ్‌సైట్లు, యాప్‌లు, ఫోన్ కాల్స్ వస్తే వాటిని వెంటనే టీటీడీ దృష్టికి తీసుకురావాలని పేర్కొంటున్నారు.