‘కేరళ స్టోరీ 2’ విడుదలపై స్టే.. సెన్సార్ బోర్డుపై హైకోర్టు ఆగ్రహం..

Wait 5 sec.

ఇటీవల కాలంలో వివాదాలతో ఎక్కువగా వార్తల్లో నిలిచిన సినిమా ‘ది : గోస్‌ బియాండ్‌’. ఇది 2023లో వివాదాల నడుమ విడుదలైన ‘ది కేరళ స్టోరీ’ చిత్రానికి సీక్వెల్‌గా రూపొందింది. టీజర్‌, ట్రైలర్లు రిలీజైన తర్వాత ఈ మూవీపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ప్రోపగాండా సినిమా అంటూ పలువురు సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు మండిపడ్డారు. అయినప్పటికీ వెనక్కి తగ్గని మేకర్స్.. ఫిబ్రవరి 27న ఈ చిత్రాన్ని థియేటర్లలోకి తీసుకురావడానికి రెడీ అయ్యారు. అయితే మరికొన్ని గంటల్లో రిలీజ్ అవుతుందనగా, ఈ మూవీకి షాక్ తగిలింది. వివాదాలకు కేంద్ర బిందువుగా నిలిచిన ‘ది కేరళ స్టోరీ 2’ సినిమాకి సెన్సార్‌ బోర్డు ఇటీవల ‘యూ/ఏ’ సర్టిఫికెట్‌ జారీ చేసింది. ఈ సినిమా సెన్సార్‌ సర్టిఫికెట్‌ ను సవాలు చేస్తూ కేరళ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం.. సినిమా విడుదలపై మధ్యంతర స్టే విధించింది. సినిమాలో అభ్యంతరకరమైన సన్నివేశాలు ఉన్నాయనే పిటిషనర్ వ్యాఖ్యలతో ఏకీభవించింది. సినిమా సరిగ్గా చూడకుండానే సర్టిఫికెట్ ఇచ్చారా? అంటూ సెన్సార్‌ బోర్డుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. మూవీని పునఃపరిశీలన చేయాలని CBFCని ఆదేశించింది.‘కేరళ స్టోరీ 2’ సినిమా సెన్సార్‌ విషయంలో దాఖలైన పిటిషన్ పై మంగళవారం కేరళ హైకోర్టులో విచారణ జరిగింది. సినిమాలో కేరళను తప్పుగా చూపించారనే ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో, విడుదలకు ముందు ఈ చిత్రాన్ని కోర్టులో ప్రదర్శించాలని పేర్కొంది. న్యాయస్థానాలు సాధారణంగా సినిమాలకు సంబంధించి భావవ్యక్తీకరణ స్వేచ్ఛ విషయంలో జోక్యం చేసుకోవని, కానీ ఈ మూవీ టైటిల్‌లో కేరళ రాష్ట్రం పేరు ఉపయోగించారు కనుక విచారణకు స్వీకరించినట్లు తెలిపింది. ‘ది కేరళ స్టోరీ 2’ సినిమాలో మతపరమైన ఉద్రిక్తతలకు దారితీసే అంశాలు ఉన్నాయనే రాష్ట్ర ప్రజల ఆందోళనలను విస్మరించలేమని కేరళ హైకోర్టు అభిప్రాయ పడింది. ఫిబ్రవరి 25న చిత్రాన్ని కోర్టులో ప్రదర్శించాలని, సినిమా చూసిన తర్వాతే సెన్సార్‌ విషయంలో నిర్ణయం తీసుకోగలమని తెలిపింది. ఈ క్రమంలో తాజాగా ఈ సినిమా చూసిన న్యాయస్థానం.. ‘కేరళ స్టోరీ 2’ సినిమా విడుదలపై స్టే విధించింది. దీంతో ఫిబ్రవరి 27న విడుదల కావాల్సిన ఈ సినిమాను తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు వాయిదా వేశారు.