చేవెళ్ల పరిధిలో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. శంకర్‌పల్లి రోడ్డులోని ఓ హీరో హోండాకు సంబంధించిన ఆటో మొబైల్స్ గోదాంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఇవాళ ఉదయం భారీ అగ్నిప్రమాదం జరగ్గా.. క్షణాల్లోనే మంటలు గోదాం మెుత్తం వ్యాపించాయి. దీంతో స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. ఫైర్ సేఫ్టీ పోలీసులుకు సమాచారం అందించి ఫైర్ ఇంజన్ సహయంతో మంటలను అర్పేశారు. ఈ సంఘటన తెల్లవారుజామన జరగటంతో అక్కడ ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. కరెంట్ షార్ట్ సరుక్యూట్ కారణంగా గోదాంలో మంటలు చెలరేగి ఉంటాయని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ప్రమాదంలో దాదాపు రూ.2 కోట్ల వరకు ఆస్తి నష్టం జరిగినట్లు తెలిసింది. రంగారెడ్డి జిల్లాల్లో ఉన్న అన్నీ ఆటో మొబైల్స్ దుకాణాలకు ఇక్కడి నుంచే వస్థువులను సప్లై చేస్తుంటారు. అయితే ఈ ఘటనపై స్ధానికులకు తీవ్ర అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఎవరో గిట్టని వారు నిప్పు పెట్టి ఉంటారని అనుమానిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ఆస్తి నష్టం, ఘటన ఎలా జరిగి ఉండొచ్చుననే విషయాలపై ఆరా తీస్తున్నారు. కాగా, ఇటీవల కాలంలో తెలంగాణలో అగ్ని ప్రమాదాలు ఎక్కువయ్యాయి. రెండ్రోజుల క్రితం హైదరాబాద్ భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో షోరూం మెుత్తం అగ్నికి ఆహుతైంది. ఆ సమయంలో షోరూంలో ఎవరూ లేకపోటవంతో పెను ప్రమాదం తప్పింది. జనవరి చివరి వారంలో నాంపల్లి బచ్చాస్ ఫర్నీచర్ దుకాణంలోనూ భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఐదుగురు అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత ఫిబ్రవరి మెుదటి వారంలో నాంపల్లి ఎఫ్ఎస్ఎల్ కార్యాలయంలోనూ జరిగింది. ఈ ఘటనలో పోలీసు శాఖకు చెందిన కీలక ఫైల్స్, కేసులకు సబంధించిన హార్డ్ డిస్కులు అగ్నికి ఆహుతయ్యాయి. ప్రస్తుతం ఎండాకాలం సమీపిస్తుండటంతో అప్రమత్తంగా ఉండాలని ఫైర్ సెఫ్టీ అధికారులు సూచిస్తున్నారు. దుకాణాలు, గోదాంల యజమానులు ఫైర్ సెఫ్టీ నిబంధనలు పక్కాగా పాటించాలని చెబుతున్నారు. లేదంటే క్రిమినల్ కేసులు బుక్ చేస్తామని హెచ్చరిస్తున్నారు.