తెలంగాణ-ఏపీ మధ్య ప్రయాణాలు సాగించేవారికి గుడ్‌న్యూస్. త్వరలోనే రానుంది. ప్రస్తుతం హైదరాబాద్-విజయవాడ, హైదరాబాద్-శ్రీశైలం నేషనల్ హైవేలపై రాకపోకలు సాగిస్తున్నారు. ఈ హైవేలపై రద్దీ పెరగటంతో తెలుగు రాష్ట్రాలను కలుపుతూ మరో హైవేను నిర్మించారు. ఖమ్మం- ఏపీలోని దేవరపల్లి మధ్య నిర్మించిన మొదటి యాక్సెస్‌ కంట్రోల్‌ గ్రీన్‌ఫీల్డ్‌ హైవే త్వరలోనే వాహనదారులకు అందుబాటులోకి రానుంది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో హైటెక్ హంగులతో నాలుగు వరుసలుగా ఈ రోడ్డు రెడీ అవుతోంది. తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం అనేక గ్రీన్‌ఫీల్డ్‌ నేషనల్ హైవేలు నిర్మాణంలో ఉన్నాయి. వీటిలో మొదటిదిగా.. తెలంగాణలోని ఖమ్మం నుంచి ఏపీలోని దేవరపల్లి వరకు 162.04 కి.మీ. పొడవున చేపట్టిన ఈ రహదారికి ఎన్‌హెచ్ఏఐ తుదిమెరుగులు దిద్దుకుంటోంది. హైదరాబాద్‌ నగరం నుంచి విశాఖపట్నం వెళ్లాలంటే ప్రస్తుతం ఎన్‌హెచ్ 65పై సూర్యాపేట, విజయవాడల మీదుగా 676 కిలో మీటర్లు ప్రయాణించాల్సి ఉంటుంది. ఈ కొత్త హైవే అందుబాటులోకి వస్తే 56 కి.మీ తగ్గనుంది. ఖమ్మం సమీపంలోని తల్లంపాడు నుంచి ఏపీలోని ఏలూరు, తూర్పుగోదావరి జిల్లాల మీదుగా దేవరపల్లి వరకు ఈ రోడ్డును నిర్మిస్తుండగా.. ఎన్‌హెచ్‌-365బీజీగా ఈ రహదారికి నంబరును కేటాయించారు. ఇక ఈ హైవే హెటెక్ హంగులతో రూపుదిద్దుకుంటోంది. సీసీ కెమెరాలు, సోలార్‌ ప్యానళ్లు, సమాచారాన్ని అందించే క్యూఆర్‌ కోడ్‌లు, అత్యాధునిక రవాణా నిర్వహణ వ్యవస్థ, ఎమర్జెన్సీ మీడియన్‌ ఓపెనింగ్స్ వంటివి ఏర్పాటు చేశారు. ప్రయాణించిన దూరానికే టోల్‌ వసూళ్లు చేయనున్నారు. పరిమిత సంఖ్యలో అంటే 19 చోట్ల మాత్రమే ఎంట్రీ, ఎగ్జిట్‌ ప్రదేశాలు ఏర్పాటు చేశారు. దానికి తోడు ప్రతి 50 కి.మీ రోడ్డుకు రెండు వైపులా దాదాపు 5 ఎకరాల్లో స్థలంలో వాహనదారులు సేదతీరేందుకు ప్రత్యేక స్థలం కేటాయించారు. ఇందులో హోటళ్లు, రెస్టారెంట్లు, టాయిలెట్స్, పెట్రోల్ బంకులు వంటి సౌకర్యాలు ఉంటాయి. హైవేపై ఏర్పాటు చేసిన క్యూఆర్ కోడ్ స్కాన్ చేయటం ద్వారా మీరున్న లోకెషన్, దగ్గర్లోనే పోలీస్ స్టేషన్లు, పెట్రోల్ బంకులు, హాస్పిటల్స్ వంటి సమాచారం తెలుసుకోవచ్చు. ఇప్పటి వరకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ మధ్య యాక్సెస్‌ కంట్రోల్‌ గ్రీన్‌ఫీల్డ్‌ రహదారి ఒక్కటి కూడా లేదు. అందుబాటులోకి వస్తే ఇదే మొదటిది అవుతుంది. ఈ రహదారిని ఈ ఏడాది మేలో ప్రారంభించడానికి ఎన్‌హెచ్‌ఏఐ ఏర్పాట్లు చేస్తోంది.