ఆంధ్రప్రదేశ్‌లో 14 ఏళ్లు నిండిన బాలికల తల్లిదండ్రులకు ముఖ్యమైన గమనిక. రాష్ట్ర ప్రభుత్వం సర్వైకల్ క్యాన్సర్ హెచ్‌పీవీ వ్యాక్సిన్‌ను ఉచితంగా పంపిణీ చేయాలని నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 3.45 లక్షల మంది బాలికలకు ఉచితంగా హెచ్‌పీవీ టీకాలు అందించనుంది. రాష్ట్రవ్యాప్తంగా 1,683 ఆరోగ్య కేంద్రాల ద్వారా వ్యాక్సిన్‌లు ఇస్తారు. తల్లిదండ్రుల్లో ఒకరి అనుమతి తీసుకుని బాలికలకు వ్యాక్సినేషన్‌ ఇస్తారు. ప్రధాని మోదీ ఈ నెల 28న రాజస్థాన్‌లోని అజ్మీర్‌లో ప్రారంభిస్తారని. ఇటు రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా ఈ నెల 28న టీకాలు పంపిణీ చేయనున్నట్లు వైద్యఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు.'కేంద్రం తొలి విడతగా రాష్ట్రానికి 1,90,890 డోసుల వ్యాక్సిన్‌‌లను పంపించింది. ఇచ్చే ముందు తల్లిదండ్రుల్లో ఒకరి సమ్మతి ఉండాలి. వ్యాక్సిన్‌ ఇచ్చిన తర్వాత సర్టిఫికెట్‌ ఇస్తారు. ఈ వ్యాక్సినేషన్‌ కార్యక్రమం సుమారు మూడు నెలల పాటు నిర్వహిస్తారు. రాష్ట్రంలో అత్యధికంగా కర్నూలు జిల్లాలో 14 ఏళ్లు నిండి 15 ఏళ్లలోపు కలిగిన బాలికలు 23,957 మంది ఉన్నారు. పోలవరం జిల్లాలో తక్కువగా 2,777 మంది బాలికలు ఉన్నారు. వాస్తవానికి ఈ హెచ్‌పీవీ వ్యాక్సిన్‌ ఖరీదు రూ. 3,927 ఉంటుంది.. కేంద్రం దేశ వ్యాప్తంగాఈ టీకాను బాలికలందరికీ ఉచితంగా అందజేయాలని నిర్ణయించింది. 90 దేశాల్లో సింగిల్‌ డోస్‌ టీకా కార్యక్రమం అమలు చేస్తున్నారు. 15 నుంచి 44 ఏళ్ల మహిళల్లో సర్వైకల్‌ క్యాన్సర్‌ ఎక్కువగా కనిపిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా ఏటా ఈ క్యాన్సర్‌ కారణంగా 6 లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇటు దేశంలో ఎక్కువగా బయటపడుతున్న క్యాన్సర్లలో సర్వైకల్‌ క్యాన్సర్‌ రెండో స్థానంలో ఉంది' అన్నారు మంత్రి సత్యకుమార్.హెచ్‌పీవీ వ్యాక్సిన్‌‌ను ప్రభుత్వం ఉచితంగా అందిస్తోంది. తొలిదశలో ఈ టీకాను 14 ఏళ్ల బాలికలకు మాత్రమే పంపిణీ చేస్తారు. రాష్ట్రవ్యాప్తంగా 14 ఏళ్ల బాలికల్ని గుర్తించేందుకు అన్ని పీహెచ్‌సీలు, అర్బన్‌ పీహెచ్‌ సీల్లో ఏఎన్‌ఎంలతో సర్వేను నిర్వహిస్తున్నారు. రెండు రోజుల్లో వివరాలు సేకరించి ప్రభుత్వానికి నివేదికను పంపిస్తారు. అప్పుడు అవసరమైన డోసుల్ని పంపిస్తారు. ఆధార్ కార్డుపై ముద్రించిన డేట్ ఆఫ్ బర్త్‌తో బాలికల వయస్సును నిర్ధారిస్తారు. ఇప్పటికే మెడికల్‌ ఆఫీసర్లకు వ్యాక్సినేషన్‌పై శిక్షణ ఇచ్చారు. అలాగే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోని స్టాఫ్‌నర్సులు, ఫార్మసిస్టులు, ఏఎన్‌ ఎంలకు శిక్షణ నిచ్చారు. ఈ నెల 28 తేదీన రాష్ట్రవ్యాప్తంగా బాలికలకు ఈ వ్యాక్సిన్ అందిస్తారు.. బాలిక తల్లిదండ్రులు ఈ విషయాన్ని గమనించి వ్యాక్సినేషన్ చేయించాలని సూచిస్తున్నారు. అటు తెలంగాణలో కూడా ఈ వ్యాక్సిన్ అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.