ఏపీలో పదవీ విరమణ వెంటనే కీలక పోస్టింగ్.. లక్ అంటే సీనియర్ IAS విజయానంద్‌దే

Wait 5 sec.

ఆంధ్రప్రదేశ్‌ సీఎస్‌గా విజయానంద్ పదవీవిరమణ చేసిన సంగతి తెలిసిందే. శనివారం రోజు ఆయన రిటైర్ అయ్యారు.. కొత్త సీఎస్‌గా సాయిప్రసాద్ బాధ్యతలు స్వీకరించారు. అయితే విజయానంద్ పదవీవిరమణ చేసిన కొన్ని గంటల్లోనే ఆయనకు కీలకమైన పోస్టింగ్ ఇచ్చారు. విజయానంద్‌ను ముఖ్యమంత్రికి ఎక్స్‌అఫీషియో ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నియమించారు.. ఈ మేరకు వెంటనే ఉత్తర్వులు జారీ చేశారు. అలా పదవీ విరమణ చేశారో లేదో.. ఇలా ఆయన పునర్నియామకానికి సంబంధించిన ఉత్తర్వులు వచ్చేశాయి.విజయానంద్ ఏపీ ఇంధనశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, ఏపీట్రాన్స్‌కో సీఎండీ పోస్టుల్లోను కొనసాగుతారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఆయన ఏడాది లేదా తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఈ పోస్టులో కొనసాగుతారని ప్రభుత్వం క్లియర్‌గా చెప్పింది. అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబుకు ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న ముద్దాడ రవిచంద్రను టీటీడీ ఈవోగా బదిలీ చేశారు. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వివాదానికి సంబంధించి టీటీడీ ఈవోగా ఉన్న అనిల్‌ కుమార్‌సింఘాల్‌ను బదిలీ చేసిన సంగతి తెలిసిందే. ముద్దాడ రవిచంద్రకు అదనపు బాధ్యతలు అప్పగించారు.. ఇప్పుడు సీఎంవోలో రవిచంద్ర స్థానంలో విజయానంద్‌కు పోస్ట్ ఇవ్వడంతో.. రవిచింద్రను టీటీడీకి పూర్తిస్థాయిలో ఈవోగా బదిలీ చేసింది ప్రభుత్వం.అంతకుముందు బాధ్యతలు చేపట్టారు. అమరావతి సచివాలయంలోని తన కార్యాలయంలో టీటీడీ, విజయవాడ దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానం వేదపండితుల ఆశీర్వచనాలు అందజేశారు.. అనంతరం సాయిప్రసాద్ పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా అధికారులు, ఉద్యోగ సంఘాల నేతలు కొత్త సీఎస్ సాయిప్రసాద్‌ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఆ తర్వాత కొత్త సీఎస్ సాయిప్రసాద్, పదవీ విరమణ చేసిన విజయానంద్ సీఎం చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలిశారు.ఆంధ్రప్రదేశ్‌ సీఎస్‌గా బాధ్యతలు స్వీకరించిన జి సాయిప్రసాద్‌ విజయవాడ దుర్గమ్మను దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆలయానికి చేరుకుని అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం దేవస్థానం ఈవో శీనానాయక్, ప్రధానార్చకులు దుర్గాప్రసాద్, స్థానాచార్య శివప్రసాదశర్మ సీఎస్‌కు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు అందజేశారు. వేదపండితులు సీఎస్‌కు ఆశీర్వచనం చేశారు.