IPL 2026 పాయింట్స్ టేబుల్ అప్డేటెడ్.. టాప్‌లో ఆరెంజ్ ఆర్మీ.. కిందికి దిగిన పంజాబ్, ఆర్సీబీ!

Wait 5 sec.

ఉప్పల్‌లో ఆరెంజ్ ఆర్మీ అదరగొట్టింది. టేబుల్ టాపర్ పంజాబ్ కింగ్స్‌నే కొట్టి టాప్‌ ప్లేస్‌లో నిల్చుంది. . పంజాబ్ కింగ్స్‌పై మ్యాచ్ అంటేనే హడల్ పుడుతున్న ఈ సమయంలో.. ఆ జట్టును చిత్తు చేసి సన్‌రైజర్స్ హైదరాబాద్ టాప్ ప్లేస్‌కు చేరుకుంది. ఐపీఎల్ 2026 పాయింట్స్ టేబుల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తొలిసారి మొదటి స్థానంలో నిలిచింది. ఈ సీజన్‌లో తొలి నాలుగు మ్యాచ్‌లలో ఒకే ఒక్క విజయం సాధించిన ఆరెంజ్ ఆర్మీ.. ఆ తర్వాత ఏడు మ్యాచ్‌లలో ఆరు మ్యాచ్‌లు గెలిచింది. అందులో వరుసగా ఐదు గెలవడం విశేషం. పంజాబ్‌పై విజయంతో 14 పాయింట్లు సొంతం చేసుకుని మొదటి స్థానానికి ఎగబాకింది. ఈ సీజన్ ఆరంభం నుంచి టేబుల్ టాపర్‌గా కొనసాగుతున్న పంజాబ్ కింగ్స్ తొలిసారి కిందికి దిగజారింది. పది మ్యాచ్‌లు ఆడిన పంజాబ్ ఆరు మ్యాచ్‌లలో గెలిచి, మూడు ఓడి 13 పాయింట్లతో రెండో స్థానానికి వచ్చింది. సన్‌రైజర్స్ విజయంతో రెండో స్థానంలో ఉన్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు మూడో స్థానానికి పడిపోగా.. రాజస్థాన్ రాయల్స్ నాలుగో స్థానంలోనే ఫిక్స్ అయింది. ప్లే ఆఫ్స్‌ మీద ఆశలు పెట్టుకున్న గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు వరుస విజయాలతో ఐదు, ఆరు స్థానాల్లో ఉన్నాయి. గుజరాత్ టైటాన్స్ పది మ్యాచ్‌లు ఆడి ఆరు విజయాలు సాధించి 12 పాయింట్లతో ఐదో స్థానంలో కొనసాగుతోంది. మూడో స్థానంలో నుంచి ఐదో స్థానం వరకూ మూడు జట్లు 12 పాయింట్లతోనే ఉండటం విశేషం. ఈ మూడు జట్లలో ఏది మొదట విజయం సాధిస్తుందో ఆ జట్టు రెండో స్థానానికి వచ్చే అవకాశం ఉంది. చెన్నై సూపర్ కింగ్స్ 5 విజయాలతో ఆరో స్థానంలో ఉంది. ఢిల్లీ క్యాపిటల్స్ అనూహ్య ఓటములతో ఒక్కసారిగా ఏడో స్థానానికి పడిపోయింది. పది మ్యాచ్‌లు ఆడిన ఢిల్లీ నాలుగు విజయాలతో ఏడో స్థానంలో ఉండగా.. కోల్‌కతా నైట్ రైడర్స్, ముంబై ఇండియన్స్ మూడు మూడు విజయాలతో ఎనిమిది, తొమ్మిదో స్థానాల్లో ఉన్నాయి. ఇక లక్నో సూపర్ జెయింట్స్ జట్టు రెండంటే రెండు మ్యాచ్‌లు గెలిచి పదో స్థానానికి పరిమితమైంది.