తిరుమ‌ల‌లోని మాడ వీధులు, స‌ర్కిళ్లు, ముఖ్యమైన మార్గాలకు ఆధ్యాత్మిక, పురాణ ప్రాశ‌స్థ్యం క‌లిగిన పేర్లను పెట్టారు. టీటీడీ పాలకమండలి సమావేశంలో ఈ నిర్ణయానికి ఆమోదం తెలిపారు. తిరుమలలో ఇకపై ఈ కొత్త పేర్లు అమల్లోకి వస్తాయి. టీటీడీ నియమించిన క‌మిటీ ప్రతిపాదించిన కొత్త పేర్లు ఇలా ఉన్నాయి. తిరుమలలో నాలుగు మాడ వీధులకు కొత్త పేర్లు పెట్టారు. తూర్పు మాడవీధికి రుగ్వేద మార్గం, దక్షిణ మాడవీధికి యజుర్వేద మార్గం, పశ్చిమ మాడవీధికి సామవేద మార్గం, ఉత్తర మాడవీధికి అధర్వణవేద మార్గంగా పేర్లు పెట్టారు. బేడీ ఆంజనేయస్వామి ఆలయ ప్రాంతానికి సాళువ నరసింహరాయల ప్రాంగణంగా పేరు పెట్టారు. తిరుమల శ్రీవారి ఆలయం ఎదురుగా ఉన్న ఖాళీ ప్రదేశానికి భగవద్రామానుజాచార్య ప్రాంగణంగా పేరు ఫిక్స్ అయ్యింది. మూవింగ్‌ బ్రిడ్జి నుంచి సహస్ర దీపాలంకరణ సేవ వరకు తిరుమలనంబి ప్రాంగణంగా.. ఆలయం వెనుక భాగం అనంతాళ్వార్‌ ప్రాంగణంగా పేరుపెట్టారు.తిరుమలలోని లేపాక్షి సర్కిల్‌‌కు అన్నమయ్య కూడలి, రామ్‌బగీచ సర్కిల్‌‌కు తొండమాన్‌ చక్రవర్తి కూడలి, ఎస్‌ఎంసీ సర్కిల్‌‌లకు పురందరదాసు కూడలి, జీఎన్‌సీ సర్కిల్‌‌కు గరుడాద్రి కూడలి, వీక్యూసీ-2 సర్కిల్‌‌కు తిరుమలరాయల కూడలి, నందకం గెస్ట్‌హౌస్‌ సర్కిల్‌‌కు వకుళమాత కూడలిగా పేరు పెట్టారు. తిరుమల ఔటర్‌ రింగ్‌రోడ్డుకు తిరువేంకటపథం, ఇన్నర్‌ రింగ్‌రోడ్డుకు అన్నమాచార్య మార్గంగా నిర్ణయించారు. నందకం సర్కిల్‌ నుంచి గోగర్భం డ్యామ్‌ వరకు నిత్యకల్యాణ మార్గం.. రామ్‌బగీచ నుంచి పుష్కరిణి వరకు శ్రీ కృష్ణదేవరాయల మార్గంగా పేర్లు పెట్టారు.జీఎన్‌సీ నుంచి లేపాక్షి నడకదారికి నమ్మాళ్వార్‌ మార్గం, పద్మావతి విచారణ కార్యాలయం నుంచి రెస్ట్‌హౌస్‌ వరకు పద్మావతి మార్గం, జీఎన్‌సీ నుంచి లేపాక్షి సర్కిల్‌‌కు గరుడాద్రి మార్గం, బస్టాండ్‌ నుంచి ఎంప్లాయీస్‌ క్యాంటీన్‌‌కు కులశేఖరాళ్వార్ల మార్గం, పిండిమర సర్కిల్‌ నుంచి ఔటర్‌ రింగ్‌రోడ్డుకు ఆకాశగంగ మార్గం, శ్రీవారి మెట్టు నడకదారికి శ్రీవారి మార్గంగా పేర్లు మారుస్తూ టీటీడీ పాలకమండలి నిర్ణయం తీసుకుంది.టీటీడీ పాలకమండలి సమావేశంలో తిరుమల ఆళ్వార్ ట్యాంక్ అతిథి గృహం స‌ర్కిల్ నుంచి బాట గంగ‌మ్మ స‌ర్కిల్ వ‌ర‌కు ఉన్న స‌ర్వ‌ద‌ర్శ‌నం క్యూలైన్ల‌లో రూ.4.55 కోట్ల‌తో అద‌న‌పు మ‌రుగుదొడ్లు నిర్మించేందుకు ఆమోదం తెలిపారు. తిరుమ‌ల‌లోని వ‌రాహ‌స్వామి విశ్రాంతి భ‌వ‌నం – 1లో రూ. 3.61 కోట్ల‌తో ప‌లు అభివృద్ధి ప‌నుల‌కు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న ఆలయాలకు ధూప, దీప, నైవేద్యాలకు ప్రస్తుతం ఇస్తున్న రూ. 5000/- నుండి రూ.10,000/- కు పెంచేందుకు నిర్ణయం తీసుకున్నారు. అలిపిరి దగ్గర శ్రీ శ్రీ‌నివాస దివ్యానుగ్ర‌హ హోమం కోసం యాగ‌శాల నిర్మించేందుకు నిర్ణ‌యం తీసుకున్నారు. ఈ యాగశాలను రూ.4.75 కోట్ల‌తో నిర్మించనున్నారు.