ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముస్లిం మహిళల జీవనోపాధికి కీలన నిర్ణయం తీసుకుంది. ముస్లిం మహిళలకు ఉచిత కుట్టుశిక్షణ పథకాన్ని అమలు చేయనుంది. రాష్ట్రవ్యాప్తంగా కుట్టు మిషన్ శిక్షణ పూర్తయిన తర్వాత ఉచితంగా కుట్టుమిషన్లను అందించనుంది. ఏపీ ప్రభుత్వం నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గం కసుమూరు దర్గా పరిధిలో ఇప్పటికే పైలట్‌ ప్రాజెక్టు కింద ఈ పథకాన్ని అమలు చేసిన సంగతి తెలిసిందే. నెల్లూరు జిల్లాలో పథకం విజయవంతం కావడంతో మరికొన్ని చోట్ల అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఏపీ ప్రభుత్వం వచ్చే నెల నుంచి తొలి విడతగా రాష్ట్రవ్యాప్తంగా 18 కేంద్రాల్లో అమల్లోకి తీసుకురావాలని నిర్ణయించింది. ఈ ఉచిత కుట్టు శిక్షణ పథకాన్ని వక్ఫ్‌బోర్డు నిధులతో అమలు చేయనున్నారు. ముందుగా ముస్లింలు అధికంగా ఉండే నియోజకవర్గాను ఎంపిక చేసుకుని.. ఉచిత కుట్టుశిక్షణను అమలు చేయనున్నారు. శ్రీకాకుళం, గాజువాక, విశాఖ దక్షిణ, కాకినాడ, రాజమహేంద్రవరం రూరల్, ఏలూరు, విజయవాడ పశ్చిమ, పొన్నూరు, ఒంగోలు, పొదిలి, నెల్లూరు సిటీ, నెల్లూరు రూరల్, ఆత్మకూరు, కర్నూలు, నంద్యాల, గుంతకల్లు, పుట్టపర్తి, కడప నియోజకవర్గాల పరిధిలో ఈ పథకాన్ని అమలు చేయనున్నారు. ఈ మేరకు ఒక్కో చోట 100 మంది వరకు శిక్షణ ఇవ్వాలని ప్లాన్ చేశారు. రాష్ట్రంలో ఈ పథకం అమలుకు రూ.1.70 కోట్లు వ్యయం అవుతుందని ప్రభుత్వం అంచనా వేసింది.ఆంధ్రప్రదేశ్ వక్ఫ్ బోర్డు ఆధ్వర్యంలో నిర్వహించనున్న తాలీం – ఏ – హునర్ టాలెంట్ టెస్ట్ గురించి గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై క్లారిటీ వచ్చింది. ఏపీ వక్ఫ్ బోర్డు ఛైర్మన్ అబ్దుల్ అజీజ్ ఈ అపోహలను నివారించేందుకు అధికారికంగా వివరాలు వెల్లడించారు. టాలెంట్ టెస్ట్ అధికారిక షెడ్యూల్ ఇలా ఉంది. అప్లికేషన్‌లు ప్రారంభించే తేది: 06-05-2026 కాగా.. అప్లికేషన్ చివరి తేది: 12-05-2026. పరీక్ష తేదీ: 17-05-2026 (ఆదివారం). ఈ షెడ్యూల్ ప్రకారమే టాలెంట్ టెస్ట్ నిర్వహిస్తారని..ఇతరత్రా ప్రచారంలో ఉన్న సమాచారం, తేదీలు వాస్తవానికి విరుద్ధమైనవని, వాటిని పరిగణనలోకి తీసుకోవద్దని సూచించారు.