ఆంధ్రప్రదేశ్‌పై అల్పపీడన ద్రోణి ప్రభావం కొనసాగుతోంది. ఈ ద్రోణి ప్రభావంతో ఇవాళ శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, చిత్తూరు, తిరుపతి, శ్రీసత్యసాయి, కడప జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. అలాగే వర్షం పడే సమయంలో పొలాల్లో పని చేసే రైతులు, కూలీలు, పశువుల కాపరులు చెట్ల కింద నిలబడరాదని సూచించారు. మరోవైపు ఎండలు, ఉక్కపోత, వేడిగాలులు కూడా కొనసాగుతున్నాయి. అల్లూరి సీతారామరాజు జిల్లా జికే వీధి మండలం, పోలవరం జిల్లా చింతూరు, గుర్తేడు మండలాల్లో తీవ్ర వడగాల్పులు, అల్లూరి సీతారామరాజు జిల్లా ముంచింగిపుట్టు, ఏలూరు జిల్లా వేలేరుపాడు, పోలవరం జిల్లా కూనవరం, వరరామచంద్రాపురం మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందన్నారు. ఈ మేరకు ప్రజలు ఎండ తీవ్రత, ఉక్కపోత విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా బుధవారం ఉష్ణోగ్రతలు ఇలా నమోదయ్యాయి.. కర్నూలు జిల్లాలోని తోవిలో అత్యధికంగా 41.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యింది. తిరుపతి జిల్లాలోని వెంకటగిరి 41.2డిగ్రీలు, పోలవరం జిల్లాలోని చింతూరులో 41డిగ్రీలు నమోదయ్యాయి. అనంతపురం జిల్లాలోని సలకంచెరువులో 40.7డిగ్రీలు, నంద్యాల జిల్లాలోని జూపాడు బంగ్లాలో 40.6 డిగ్రీలు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఏలూరు జిల్లా కుక్కునూరుతో పాటుగా కడప జిల్లా ఎర్రగంట్లలలో 39.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మార్కాపురం జిల్లాలోని కంభం, ఎన్టీఆర్ జిల్లా విజయవాడ తూర్పు, పల్నాడు జిల్లా దుర్గిలలో 39.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు తెలిపారు.మరోవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) లో కాంట్రాక్టు పద్ధతిలో ప్రాజెక్టు మేనేజర్ - మెటిరాలజిస్ట్ ఉద్యోగ భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్ విడుదలైంది. ఆఖరు తేది 14-05-2026 సాయంత్రం 5 గంటలలోపు అప్లికేషన్ పంపించాలని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. అర్హత కలిగిన అభ్యర్థులు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని.. క్వాలిఫికేషన్, ఇతర వివరాలకు వెబ్ సైట్‌లో చూసుకోవాలని సూచించారు.