తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయాన్ని అందుకున్న విజయ్ టీవీకే పార్టీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఉన్నా సరే ప్రభుత్వ ఏర్పాటుకు కొత్త తలనొప్పులు ఎదురవుతున్నాయి. విజయ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 118 ఎమ్మెల్యేల మద్దతును కూడగట్టడంలో సవాళ్లు ఎదురవుతున్నాయి. టీవీకే పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు తలనొప్పులు ఎదురవుతున్న వేళ మాజీ ఎంపీ ఓ ట్వీట్ చేశారు. విజయ్ ప్రభుత్వ ఏర్పాటుకు ఓ సలహా ఇచ్చారు.టీవీకే అధినేత విజయ్ చిన్న ప్రాంతీయ రాజకీయ పార్టీలతో పొత్తులు పెట్టుకోవడానికి బదులుగా.. వారిని టీవీకేలో విలీనం కావాలని ఆహ్వానించాలని సలహా ఇచ్చారు. తమిళనాడులో స్థిరమైన మెజారిటీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా కృషి చేయాలన్నారు. స్పష్టమైన ప్రజా తీర్పు, రాజకీయ స్థిరత్వం ఉన్న ప్రభుత్వాల వల్ల తమిళనాడు ప్రజలు చారిత్రాత్మకంగా లబ్ధి పొందారని గుర్తు చేశారు. అయితే విజయసాయిరెడ్డి చెప్పినట్లు చిన్న ప్రాంతీయ పార్టీలు టీవీకేలో విలీనం చేయడం అంత సులభం కాదు.. ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో ఆ పార్టీలు విలీనంవైపు మొగ్గు చూపడం అసాధ్యమనే చెప్పాలి. ప్రస్తుతానికి కాంగ్రెస్ తప్ప అన్ని పార్టీలు విజయ్‌తో కలిసేందుకు సిద్ధంగా లేవు. టీవీకే పార్టీ 108 స్థానాల్లో గెలిచింది.. విజయ్ రెండుచోట్ల పోటీచేసి గెలవడంతో ఒక స్థానాన్ని పక్కనపెడితే టీవీకే బలం 107. విజయ్‌కు కాంగ్రెస్ మద్దతు తెలియజేయడంతో ఆ పార్టీ ఐదుగురు ఎమ్మెల్యేలను కలిపితే బలం 112 అయ్యింది. ను గవర్నర్‌ దగ్గరకు తీసుకెళ్లి ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలని కోరారు.. కానీ ప్రభుత్వం ఏర్పాటుకు కావాల్సిన 118మంది ఎమ్మెల్యేల మద్దతు కావాల్సిందేనని గవర్నర్ చెప్పడంతో తలనొప్పులు మొదలయ్యాయి. మరో ఆరుగురు ఎమ్మెల్యేల మద్దతు ఉంటేనే విజయ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలుగుతారు. మరోవైపు బెంగాల్ ఎన్నికలలో ఓటమి తర్వాత రాజీనామా చేయకూడదని మమతా బెనర్జీ తీసుకున్న నిర్ణయం భారత ప్రజాస్వామ్య చరిత్రలో ఎప్పుడూ జరగలేదన్నారు విజయసాయిరెడ్డి. ప్రజల తీర్పును గౌరవించి, ఎన్నికలలో ఓటమి తర్వాత పదవి నుంచి వైదొలగడం ఒక ప్రాథమిక ప్రజాస్వామ్య సంప్రదాయమని.. దీనిని ఎన్నడూ రాజకీయాలకు ముడిపెట్టి చూడకకూడదన్నారు. అలాగే బెంగాల్ ఎన్నికలలో అసలైన విజేత కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. పశ్చిమ బెంగాల్‌లో బూత్ లెవల్ నుంచి సంస్థాగత వ్యూహంతో ఆయన చేసిన ప్రచారం మంచి ఫలితాలనిచ్చిందన్నారు. 1960లో భారతదేశ జీడీపీకి బెంగాల్ 10.5% వాటాను అందించగా.. ఇప్పుడు ఆ వాటా కేవలం 5.6%కి పడిపోయిందన్నారు. బెంగాల్‌‌‌లో కొలువుదీరబోయే బీజేపీ ప్రభుత్వం ఆ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించి, రాష్ట్రానికి పూర్వ వైభవాన్ని తిరిగి తీసుకురావడానికి ఇప్పుడు అపారమైన అవకాశాల ఉన్నాయన్నారు.